కృషి విజ్ఞాన కేంద్రం, మల్యాల వారు గిరిజన ఉప ప్రణాళిక 2021-22 క్రింద జనవరి 5 నుండి 7 వరకు మహబూబాబాద్ రైతు వేదికలో గిరిజన మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పై నైపుణ్య శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం ముగింపు శుక్రవారం మహబూబాబాద్ రైతు వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా కె. వి. కె ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. ఎస్. మాలతి మాట్లాడుతూ గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి ఆత్మాభిమానంతో బ్రతకాలని, కుటుంబానికి ఆర్థిక చేదోడు వాదోడు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవికే శాస్త్రవేత్తలు డా. ఎన్. కిషోర్ కుమార్, డా. ఈ. రాంబాబు, నైపుణ్య శిక్షకురాలు శ్రీదేవి, 25 మంది గిరిజన మహిళలు పాల్గొన్నారు.