దేశంలో రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఓమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరు పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు సంబంధించి జిల్లా ఎస్పీ సోమవారం ఓ ప్రకటనలో పలు ఆదేశాలను జారీ చేశారు
ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు జిల్లాలో ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక సహా ఇతర సామూహిక సమావేశాలు పూర్తిగా నిషేధించడం జరుగుతుందని అన్నారు. ప్రజా రవాణా నిర్వహణ సంస్థలు, దుకాణాలు, మాల్స్, సంస్థలు, కార్యాలయాలు, మొదలైనవి కింది వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని అన్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఫిజికల్ డి స్టాన్సింగ్ పాటించడం. ప్రాంగణాన్ని తరచుగా శానిటైజేషన్ చేయడం. ఐఆర్ థర్మామీటర్లు లేదా థర్మా స్కానర్‌లతో ఎంట్రీ పాయింట్ ల దగ్గర స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం. శానిటైజర్స్ తో చేతులు శుభ్రపరచుకునేందుకు సదుపాయం కల్పించడం తప్పనిసరి అమలయ్యేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు మరియు విద్యాసంస్థల నిర్వహకులు తమ సంస్థలలో సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించేటట్లు ఆయా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించాలని అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత పాటించడం తప్పని సరి పాటించాలని అన్నారు. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాదులు ఉన్నవారు ప్రత్యేకంగా కోవిడ్-19 ఎదుర్కొనేందుకు వైద్యుల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లు ధరించని వారికి విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం 1000/- రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని అలాగే పై నిబంధనలు పాటించని ఆయా సంస్థలపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు ఈ నెల10వ తేది వరకు అమలులో ఉంటాయని అన్నారు. పై ఆంక్షలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.