రైతు బంధు పథకం చరిత్ర లిఖించిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. సోమవారం ఆయన మహబూబాబాద్ లో ఓ ప్రకటనలో పై విధంగా పేర్కొన్నారు. రైతు బంధు పథకం ప్రారంభమై పంట పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న డబ్బు ఈ జనవరి 10 నాటికి రూ. 50, 000 కోట్లకు చేరనున్న సందర్భంగా రైతుబంధు వారోత్సవాలు జరపాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు వారోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ అన్నారు.
వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ రైతు బంధు అని, స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదని, రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనని అన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదని, వ్యవసాయరంగ అభివృద్ధిలో కేంద్రం విఫలం ఐనదని, పెట్టుబడి సాయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొత్త చరిత్రను సృష్టించిందని, రైతు శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు ఆధునిక యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు.