పిల్లలకు విద్యాభ్యాసం తోపాటు ఆటలూ ముఖ్యమేనని ఏకాశిల విద్యా సంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 'ఏకశిలా ఏంజెల్స్' పాఠశాల ప్రాంగణంలో సుమారు ఏడు లక్షల వ్యయంతో నిర్మించిన బహిరంగ పిల్లల ఆటస్థలాన్ని, ఆటల వస్తువుల వినియోగాన్ని ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే మానసికంగా అంత ఆరోగ్యంగా ఉంటారని, ఆ మానసిక ఆరోగ్యమే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా ఈ ఆట వస్తువులు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభకు మరింత పదును పెట్టి ఆనందాన్ని , ఆరోగ్యాన్ని మానసికోల్లాసాన్ని ఇచ్చి ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించడానికి ఉపకరిస్తాయని, అందులో భాగంగానే విభిన్న ఆటవస్తువులతో బహిరంగ ఆటస్థలాన్ని నిర్మించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ తిరుపతిరెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్ కొత్త రమేష్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ఐస్లిన్, మయూరి, జూడ్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.