అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణం తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని నియోజకవర్గం ఐ టిడిపి అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్, తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం వారు విలేకరులతో పట్టణంలో మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న 2. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. తాడేపల్లి లో సీఎం ఇంటిని ముట్టడించడానికి వెళుతున్న నాయకులను రెండు రోజులు ముందే అరెస్టు చేయించి రాజ్యాంగ హక్కులను కాల రాశారన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవని వెంటనే అరెస్ట్ అయిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నవీన్, షామీర్, మాల మనోహర్, భార్గవ్, నిరంజన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.