కాప్రా సర్కిల్ పరిధిలోని స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులు శుక్రవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో డీసీ ఎన్. శంకర్ ను కలిసి రాంకీ సంస్థ తమ పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తుందని, రాంకీ సంస్థకు ఎలాంటి చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించవద్దని, కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇంటింటికి చెత్త సేకరించే రిక్షా కార్మికులు గత 23 సంవత్సరాల నుండి చెత్త రిక్షాల మీద జీవనం కొనసాగిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఇంటింటికి చెత్త సేకరణ లో భాగంగా రిక్షా కార్మికులను గుర్తించి స్వచ్ ఆటో టిప్పర్లను ముఖ్యమంత్రి కేసిఆర్ 2015 సంవత్సరంలో సబ్సిడి ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు.
ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా రాంకీ అనే ఒక ప్రైవేట్ సంస్థకు రిక్షా కార్మికులు దగ్గరకు వచ్చి, కమర్షియల్, అపార్ట్మెంట్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్ తీసుకొని మేమే పనిచేస్తామని మీకు ఎలాంటి సంబంధం లేదని, మా రిక్షా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ పనిమీదనే జీవనం సాగిస్తున్నామని, అప్పుడు లేని నియమ నిబంధనలు ఇప్పుడు పెడుతున్నారని డిప్యూటి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
రాంకీ సంస్థతో కలసి పనిచేయాలని మాకు ఆటో టిప్పర్ కేటాయింపు సమయంలో ఎలాంటి నియమాలు లేవని, ఆటో టిప్పర్లు ఇచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా, ఇన్ని రోజులు ఆటోల సర్వీసింగ్, డీజిల్ ఖర్చులు బరిస్తూ, ఇంటింటి చెత్త సేకరణ ద్వారా వచ్చే ఆదాయంతో ఆటోలతో పాటు తమ ఇల్లును నడిపిస్తున్నామని వాపోయారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రాంకీ సంస్థకు చెత్త సేకరణ అప్పగించవద్దని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు వీరబ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు చిన్న నర్సింహ, ప్రధాన కార్యదర్శి కె రవి, సంయుక్త కార్యదర్శి వి నరేష్, కోశాధికారి కిరణ్, కార్యవర్గ సభ్యులు రామచంద్ర, రాఘవేంద్ర, వీరేశ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.