తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండలంలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మండల వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగమనాయుడు పల్లి వద్ద పాముల కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని మండల అధికారులు సూచిస్తున్నారు.