పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని బిజెవైఎమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాలి హరిప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించి నేడు అధికారంలోకి రాగానే సామాన్యుని నడ్డి విరిచే విధంగా ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
వైకాపా ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఉప్పు మొదలుకుని పప్పు ధాన్యాల వరకు ప్రతి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచిందన్నారు. అలాగే చెత్త పన్ను, ఇంటి పన్ను తో పాటు ఇప్పుడు కరెంటు ఛార్జీలను పెంచిందని, పేద, మధ్య తరగతి కుటుంబాల మీద మోయలేని భారం మోపుతుందని ధ్వజమెత్తారు.
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. సుస్మా, కె. రామచంద్రారెడ్డి, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్, మునగల చంద్ర, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.