కడప జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు నాటుసారా తయారీ ప్రాంతాలను గుర్తించి దాడులు ఉధృతం చేయాలని జిల్లా ఎస్పీ కే. కే. ఎన్ అన్బురాజన్ ఐ. పి. ఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని డీఎస్పీ లతో సమీక్షా సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నాటుసారా తయారీదారులపై పి. డి యాక్ట్, జిల్లా బహిష్కరణ అస్త్రాలను ప్రయోగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా రూపొందించిన 'దిశ' యాప్ ను ప్రతి మహిళ వినియోగించేలా అవగాహన కల్పిస్తూ డౌన్ లోడ్స్ పెంచాలని ఆదేశించారు.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో కోర్టులో త్వరితగతిన విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులను త్వరితగతిన ఛేదించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా గ్రామాలను సంబంధిత డి. ఎస్. పి లు, సి. ఐ లు, ఎస్. ఐ లు తరచూ సందర్శిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలని ఆదేశించారు.
లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం (LHMS) యాప్ ను ప్రజలు విస్తృతంగా వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. బ్లూ కోల్ట్స్, రక్షక్, హైవే పట్రోల్, 'దిశ' వాహనాలను సమర్ధవంతంగా వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. సమావేశంలో కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద రావు, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు, కమాండ్ కంట్రోల్ ఇంచార్జి డీఎస్పీ సుధాకర్, 'దిశ' పోలీస్ స్టేషన్ డీఎస్పీ వాసుదేవన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వెంకటకుమార్, రెడ్డెప్ప, పాల్గొన్నారు.