కృష్ణా: ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమా..
సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లెపండగ’ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభలో అభిమానులు 'ఓజీ' అంటూ నినాదాలు చేయగా ఆయన స్పందించారు. వినోదం అందరికీ కావాల్సిందే. ఈ పల్లె పండగ ఎందుకు చేస్తున్నామో మీకు చెబుతా. రేపు మీరంతా మీ అభిమాన కథానాయకుల సినిమాలకు వెళ్లాలి. టికెట్ల కోసం డబ్బులు పెట్టాలి అంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి. వినోదం కన్నా ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలి. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుంటా. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాని అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ముందు దానిపై దృష్టిపెడదాం’’ అని అన్నారు.