గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం పేద, మధ్య తరగతి కుటుంబాల పాలిట కల్పవృక్షమని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు రీజినల్ మేనేజర్ ఐ. శ్రీకాంత్ అన్నారు. ఇటీవల మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పసువుల కాపరి చెన్నబోయిన నారాయణ ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు. అతను చండ్రుగొండ గ్రామీణ వికాస బ్యాంకులో వెయ్యి రూపాయల గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టాడు. దీంతో అతనికి బ్యాంకు ద్వారా ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరు అయ్యాయి. దీనిని గురువారం ఏపీజీవీబీ బ్యాంకులో మృతుడి నామిని అయినా సిహెచ్ కిరణ్ కు రీజినల్ మేనేజర్ ఐ. శ్రీకాంత్ 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు పూటగడవని పరిస్థితుల్లో ఉన్నారని అలాంటి కుటుంబంలో అంతో ఇంతో సంపాదించే కుటుంబ సభ్యుడు ఈ ప్రమాదంలో చనిపోతే మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది లబ్ధి పొందారని అన్నారు. ఈ పథకంలో చేరాలనుకునే వారికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ లేనివారు తమ దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి తమ పేరు మీదా ఖాతా తెరవాలి. అనంతరం ప్రమాద బీమా కొరకు 12 రూపాయలు, 350 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల ప్రమాద ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లికేషన్ ఫారం బ్యాంకులో అందజేస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం జరగరానిది జరిగి ఖాతాదారుడు మరణిస్తే, అతని నామినికి ఇన్సూరెన్స్ డబ్బులు అందజేయడం జరుగుతుందన్నారు.
ఐదువందల ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి పది లక్షలు, వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి 20 లక్షల రూపాయలు తక్షణమే అందజేయడం జరుగుతుందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆఫీసర్ కే. శ్రీనివాస్, అడ్వాన్స్ మేనేజర్ బి. బాలాజీ, నోడల్ ఆఫీసర్ రవికుమార్, బ్రాంచ్ మేనేజర్ జి. సునీల్ కుమార్, ఎస్బిఐ నరేందర్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు త్రినాధ్, రూప, క్యాషియర్ ఎస్కే షాన్ వాజ్, బ్యాంక్ సిబ్బంది సత్యనారాయణ (సత్తి), ఖాతాదారులు కే. తిరుమలరావు, మిట్టపల్లి మోహన్ రావు, సిఎస్పీలు, సీసీలు, గ్రామ దీపికలు పాల్గొన్నారు.