ఖమ్మం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ పిసి వీరస్వామి మాట్లాడుతూ ముదిగొండ మండలం కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగిని ఏపిఎం ను దళిత అధికారి అనే చిన్న చూపుతో అకారణంగా దూషించి, తన ఉద్యోగం ధర్మంకు ఆటంకాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆధిపత్య స్వభావంతో అక్కడ పోలీసులు, మిగిలిన ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఉన్నప్పటికీ కేవలం ఏపిఎం తక్కువ కులానికి చెందిన అధికారి అనే ఉద్దేశ్యంతో అందరూ ముందు బట్టలు విప్పి కొడుతాను అని దౌర్జన్యం గా, అహంకారం తో మాట్లాడటం అన్యాయం అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క అతనిని పార్టీ మండలం అధ్యక్షుడిగా, అలాగే పార్టీ నుండి సభ్యత్వం తొలిగించి తన నిజాయితీ ని నిరూపించుకోవాలని కోరారు. రమేష్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. ఇటీవల కురిసిన ఆకాలవర్షాల కారణంగా తడిసిన వడ్లు, మొక్కజొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.