అనంతపురం జిల్లా వ్యాప్తంగా సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు పదవరోజు కు చేరుకున్నాయి. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని సత్వరమే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలంటూ కార్మికులు ఒంటికాలి పై నిలబడి వినూత్న నిరసనకు దిగారు. కార్మికులు దీక్ష చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా 900 గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం లో ఎటువంటి స్పందన కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 650 మంది కార్మికులు సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు నందు విధులు నిర్వర్తిస్తున్నారు. జీతాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము 24 సంవత్సరాలు తాగునీటి ప్రాజెక్టు నందు పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాల్సిదిగా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు