అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సాయంత్రం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ళ లోతు వర్షపునీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో వర్షపునీరు రోడ్లపై నిల్వ ఉండి రహదారులు పాచి పట్టి పోయాయి. వర్షం వచ్చిందంటే వృద్ధులు, చిన్న పిల్లలు మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి వర్షపునీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.