బీర్కుర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో ఇసుక దందా గుత్తేదారులకు కాసులు కురిపిస్తోంది. పగటిపూట వే బిల్లులతో ఇసుక లారీలు నడుస్తుండగా రాత్రి వేళల్లో అనుమతి పత్రాలు లేకుండానే ఇసుకను తరలించుకుపోతున్నారు. సాయంత్రం 6 దాటితే ఇసుక క్వారీలు మూసివేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇసుక గుత్తేదారులు చెలరేగిపోతున్నారు.
ప్రతిరోజు సుమారు 100 లారీలు వే బిల్లులు లేకుండానే దొడ్డిదారిన ఇసుక తరలింపు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. దీనితో ప్రభుత్వానికి కి ఆదాయం భారీగా కోత పడుతుంది. టిఎస్ఎన్డిసి జిల్లా అధికారులు స్థానికంగానే ఉంటూ అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కాసులకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లతో చేతులు కలుపుతున్నారు. ఇసుక క్వారీల్లో కనీస నిబంధనలు పాటించకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను హైదరాబాద్ తో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం వేళలో సుమారు 40 లారీల్లో వే బిల్లులు లేకుండానే ఇసుక తరలించుకుపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న బిచ్కుంద మండలం కత్గవ్ గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. సుమారు మూడు గంటల పాటు లారీలను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. దీంతో క్వారీ నిర్వాహకులు పోలీసులను పంపించి గ్రామస్తులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో క్వారీ నిర్వాహకులకు, పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు.