ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కౌట"బి" గ్రామంలోని రైతు సేవ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తెలంగాణ విత్తన సంస్థ ద్వారా సరఫరా చేసిన శనగ విత్తనాలను ఆయన పరిశీలించారు. తెలంగాణ విత్తన సంస్థ శనగ విత్తనాలు నాణ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విత్తన నమూనాలను సేకరించారు. విత్తన నాణ్యతపై అనుమానం ఉన్న రైతులు ముందుగా మొలక పరీక్షలు చేసుకున్న తర్వాతనే విత్తు కోవాలని సూచించారు. ఆయన వెంట ఏడిఏ శ్రీధర్ స్వామి, ఏఈఓ సంతోష్, రైతులు ఉన్నారు.