అమ్మ లేకపోతే జననం లేదు.. అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు.. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే అమ్మను దైవంతో పోలుస్తాం. 'మాతృదేవోభవ' అని అమ్మను పూజిస్తాం. మన జీవితంలోకి ఎంతో మంది ప్రేమానురాగాలు వచ్చి వెళ్లినా అమ్మ ప్రేమ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిన్నప్పుడు మనకు పట్టే ఉగ్గుపాలలోనే అమ్మ తన ప్రేమను కలిపి తాగిస్తుంది. ఏడిస్తే లాలిస్తుంది. తప్పుచేస్తే దండిస్తుంది. నువ్వు ప్రతిభావంతుడివి అయితే గుండెకు హత్తుకుని మెచ్చుకుంటుంది. అందుకే, మాతృమూర్తిని కీర్తించడానికి ఒక రోజును కేటాయించారు. ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.మరో రెండు రోజుల్లో మదర్స్ డే వస్తోంది. మాతృ దినోత్సవాన్ని పురష్కరించుకుని విశాఖపట్నం జిల్లాకు చెందిన సూక్ష్మ కళ నిష్నాతుడు గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొనపై తల్లీబిడ్డల శిల్పాన్ని చెక్కారు. ఈయన స్వస్థలం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు.