పెందుర్తి నియోజకవర్గం వేపగుంట నుండి పినగాడి రహదారికి మహర్దశ పట్టనుంది. సుమారు 13.92కోట్ల రూపాయల నిధులతో రహదారి నిర్మాణానికి గాను ఈ రోజు మంత్రి గుడివాడ అమర్నాధ్ శంకుస్థాపన చేశారు. స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఇటీవల అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తిన అంశాల్లో ఒకటైన ఈ రహదారి గత చాలా కాలంగా అపరిష్కృత సమస్యగా ఉంది. ఈ నాటికి మోక్షం కలిగినందుకు స్థానికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి అమర్నాధ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడారు. సబ్బవరం, చోడవరం, దేవరాపల్లి, పాడేరు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా వేపగుంట, పినగాడి మార్గం గుండా ప్రయాణం చేస్తుంటారని, కొన్ని అనివార్య కారణాల వలన రోడ్ల పునఃనిర్మాణం ఆలస్యం అయిందని, వీలైనంత త్వరిత గతిన రహదారిని నిర్మించి అందరికి అందుబాటులోకి తేనున్నామన్నారు. అందుకుగాను జరగనున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. అలాగే మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.