తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సరస్వతి మాత ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయా శాఖ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయి సన్నాహా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 2 నుంచి 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహించాలని స్పీకర్ పోచారం అన్నారు. 20 రోజులపాటు ఊరురా పండగ వాతావరణం లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. రైతు వేదికను మామిడి తోరణాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ గురించి రైతులకు వివరించాలని సూచించారు. రోజుకో శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా శాఖలకు కేటాయించిన తేదీల్లో వారు చెప్పటాల్సిన కార్యక్రమాలపై అప్పటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం ఉండాలన్నారు. ప్రభుత్వం పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. అభివృద్ధికి సంబంధించిన స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ రంగంలో మనలను మించిన మొనగాడు ఎవరూ లేరన్నారు.
ఎన్టీఆర్ రామారావు ప్రారంభించిన సంక్షేమ రంగాన్ని
కేసీఆర్ కొనసాగిస్తూ వారికి నిజమైన వారసుడు అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో 2014 లో 1. 08 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే నేడు 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వరి ధాన్యం ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 2021-22 లో 1. 30 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా ఉండి పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు నిఖిత, వికాస్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా ఉన్నతాధికారులు, బాన్సువాడ నియోజకవర్గంలోని మండల ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ ప్రభుత్వ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ అధ్యక్షులు , సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.