ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా జీవో నెంబర్ 58 ద్వారా పేద ప్రజలకు ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీ సిక్స్ ఇంక్లైన్ బ్యారెక్స్ ఎదురుగా సర్వే నంబర్ 280 ప్రభుత్వ భూమి లో పేదలు వేసుకున్న గుడిస వాసుల భూ పోరాటానికి మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ గురువారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీలో జీవో నెంబర్ 58 ద్వారా పేదలకు భూములు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, దాని ప్రకారమే గుడిసె వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని మరో మార్గం లేక ఈ భూ పోరాట కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని హనుమకొండ, వరంగల్, పరకాల, రఘునాథపల్లి లాంటి అనేక ప్రాంతాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారని అన్నారు. భూపాలపల్లిలో ఈ పోరాటం ఐదవ రోజుకు చేరుకున్నదని అన్నారు. గతంలో అనేక భూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ ఎర్రజెండా పార్టీకి ఉందన్నారు. పేదలకు భూములు దక్కేంతవరకు ఎర్రజెండా సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. కేసులకు భయపడేది లేదని జైలుకైనా వెళ్తాం కానీ భూమిని వదిలేది లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సి ఆర్ నగర్ బాంబులగడ్డలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేద ప్రజలకు కరెంటు, రోడ్లు మంచినీరు ఇచ్చేంతవరకు వారికి అండగా నిలవడం జరిగిందని అన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 280 ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న సుమారు 2500 మందికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాలు అందజేయాలని, పట్టాలు ఇచ్చేంతవరకు వెనక్కి పోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బూర్జవ పార్టీలు బీరు బిర్యానీతో ఓటర్లను మచ్చిక చేసుకుని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలను ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని పేద ప్రజల ఓట్లన్నీ మీకే వేస్తామని.. ఇప్పటికైనా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొరిమి సుగుణ, క్యాతరాజ్ సతీష్, సోతుకు ప్రవీణ్, వెంకటేష్ ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, రాజు, మహేందర్, పృద్వి, రాజేశ్వరి, మాతంగి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.